
- గాంధీ హాస్పిటల్లో హెల్త్ మినిస్టర్ దామోదర ఆకస్మిక తనిఖీలు
- ఐవీఎఫ్ సేవలపై అసంతృప్తి, చర్యలకు ఆదేశం
హైదరాబాద్ సిటీ, పద్మారావునగర్, వెలుగు : గాంధీ ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, డాక్టర్లు ముందస్తు సమాచారం లేకుండా డుమ్మా కొట్టడంపై ఆయన మండిపడ్డారు. నిర్లక్ష్యం వహించిన అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రిని ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నేరుగా అవుట్ పేషెంట్ వార్డుకు వెళ్లి పేషెంట్లతో మాట్లాడారు. ఆపై ప్రసూతి వార్డుకు వెళ్లి సౌకర్యాలపై పేషంట్లను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లో సమస్యలు, సౌకర్యాల గురించి సూపరింటెండెంట్ రాజకుమారిని అడిగి తెలుసుకుని అసహనం వ్యక్తం చేశారు.
డాక్టర్లు డ్యూటీకి రారు, నర్సులకు అటెండెన్స్ రిజిస్టర్ లేదు
డాక్టర్ల అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించుకొని పరిశీలించాక.. కొందరు డాక్టర్లు గైర్హాజరు అయినట్లు మంత్రి గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి రానివాళ్లపై చర్యలు తీసుకోవాలని డీఎంఈ నరేందర్కుమార్ను ఆదేశించారు. ఓపీ వార్డులో ఉండాల్సిన ఆయా డిపార్ట్మెంట్ల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంతో వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు.
నర్సులకు అటెండెన్స్ రిజిస్టర్ లేకపోవడంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గాంధీలో పాలనా యంత్రాంగం సరిగా లేకపోవడంతో ఇలాంటి లోపాలు నెలకొన్నాయని మండిపడ్డారు. ఆస్పత్రి రెండో ఫ్లోర్లోని ఫిమేల్వార్డు, రేడియాలజీ డిపార్ట్మెంట్లోని ఎక్స్రే, ఎంఆర్ఐ, సీటీ స్కానింగ్, ఐవీఎఫ్ కేంద్రాలను మంత్రి పరిశీలించారు. ఐవీఎఫ్ సేవలు ప్రారంభమై ఏండ్లు గడుస్తున్నా ఫలితాలు ఆశించిన స్థాయిలో రావట్లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
సంబంధిత డాక్టర్లకు షోకాజ్ నోటీసులివ్వాలని డీఎంఈని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గాంధీలోని పలు అంశాలపై రివ్యూ చేయాల్సి ఉందన్నారు. తనిఖీల తర్వాత హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ గాంధీ డాక్టర్లతో సమావేశమయ్యారు. డ్యూటీ డాక్టర్ల డుమ్మా, ఐవీఎఫ్ సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఆదేశాలతో 32 మంది డాక్టర్లకు షోకాజ్ నోటీలిచ్చినట్లు తెలిసింది.